Back to Stotras తిరిగి వెళ్ళండి

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు కలవాడు. పామును యజ్ఞోపవీతంగా ధరించే వాడు. తల మీద చంద్ర వంక కలవాడు. అత్యంత కరుణ గల వాడు. నారుదుడు మొదలైన యోగుల చేత స్తుతించ బడే వాడు. దిగంబరుడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

అనేక సూర్యుల తేజస్సు కలవాడు. జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు. నల్లని కంఠము కలవాడు. కోరిన కోరికలు తీర్చేవాడు. మూడు కన్నులు కలవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

త్రీశూలాన్ని ఖట్వాయుద్ధాన్ని వరుణ పాషాన్ని దండాన్ని ధరించిన వాడు. ఆది దేవుడు. నల్లని శరీరం కలవాడు. నాశనము లేనివాడు. ఎన్నటికీ తరగని వాడు. భయంకరమైన పరాక్రమం కలవాడు. వింత తాండవం చేసేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహం |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ఇహలోక సౌఖ్యలను మోక్షాన్ని ఇచ్చేవాడు. గొప్ప అందమైన ఆకారం కలవాడు. భక్తులను బిడ్డలుగా చూసుకునే వాడు. స్థిరంగా నిలిచిన వాడు. లోకాలన్నిటిని నియంత్రించేవాడు. ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డాణమును ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడు. కర్మ బంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు. బంగారు రంగు శరీరము పై పాములనే తాళ్లుగా ధరించిన వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు. నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్ట దేవుడు గా ఉండే వాడు. మచ్చలేనివాడు. మృత్యు దేవత గర్వాన్ని నశింపజేసే వాడు. ఆ దేవత భయంకరమైన కోరల నుండి, విడిపించేవాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చి వేసే ప్రళయకారకుడు. తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింప చేసేవాడు. కఠినంగా క్రమ శిక్షణ చేసేవాడు. అణిమ, మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించే వాడు. పుర్రెల దండ ధరించే వాడు అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

భూతాల సైన్యానికి నాయకుడైన వాడు. లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించే వాడు. కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్ళకు తగిన పుణ్య ఫలాన్ని అందించే వాడు. నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికి అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం |
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువం || ౯ ||

ఎవరైతే అందమైన, జ్ఞానాన్ని, మోక్షాన్ని అందించే, కొంగ్రొత్త పుణ్యాన్ని పెంచే, దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభి గుణాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవ అష్టకాన్ని ప్రతి దినము చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాద సన్నిధికి చేరుకుంటారు. ఇది తథ్యం.

ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్ |