Uruleni Polimera Peru Pempuleni Bratuku ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు
Author: Annamacharya రచయిత: Annamacharya
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు
పల్లవి:
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు |
గారవంబులేని ప్రియము కదియనేటికే ||
చరణం 1:
ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల |
యెండలేని నాటి నీడ యేమిసేయనే |
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల |
రెండు నొకటిగాని రచన ప్రియములేటికే //ఊరులేని//
చరణం 2:
మెచ్చులేని చోట మంచిమేలు కలిగీనేమి సెలవు |
మచ్చికలేని చోట మంచిమాట లేటికే |
పెచ్చు పెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము |
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే //ఊరులేని//
చరణం 3:
బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన |
శంకలేక కదియలేని చదువులేటికే |
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి |
వేంకటాద్రి విభుడు లేని వేడుకేటికే //ఊరులేని//