Urake Nannitu Duri ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు
Author: Annamacharya రచయిత: Annamacharya
ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు
పల్లవి:
ఊరకే నన్నిటు దూరి వుప్పతించేవు |
యేరీతి తక్కరియౌటా యెఱఁగవు నీవు ||
చరణం 1:
అతఁడు వాసులెక్కించి ఆటకానకుఁ బెట్టితే |
యేతులకుఁ గాఁతాళించి యేలచూచేవే |
రాతిరిఁబగలుఁ దాను రచ్చ లెందోసేసి వచ్చి |
యీతల సటలుసేసే దెఱఁగవు నీవు //ఊర//
చరణం 2:
తానే సన్నలు సేసి తగవులఁ బెట్టితేను |
పేనిపట్టుక నీవేల పెనఁగాడేవే |
ఆనుకొని వాడవారి నందరిఁ బెండ్లాడివచ్చి |
యీనేరుపులు చూపేది యెఱఁగవు నీవు //ఊర//
చరణం 3:
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యిద్దరిఁ గూడితే |
చేవమీర నీవేల సిగ్గువడేవే |
వేవేలుసతులకు వేరేసేసవెట్టి వచ్చి |
యీవిధాన మొఱఁగేది యెఱఁగవు నీవు //ఊర//