Okkade Antaryami Vupakari Chepattu ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు
Author: Annamacharya రచయిత: Annamacharya
ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు
పల్లవి:
ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు |
తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||
చరణం 1:
యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు |
గుఱియై మాయలలోన గూడించే వింతె |
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు |
తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె //ఒక్కడే//
చరణం 2:
తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు |
వలసితే నుండు బోవు వన్నెవంటిది |
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు |
పలులంపటములచే బరచెడి దింతె //ఒక్కడే//
చరణం 3:
సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు |
బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె |
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత |
నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే //ఒక్కడే//